ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఎన్నికల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసేందుకు కృషి చేయాలి
మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, మెట్రో సిటీ టైమ్స్ (ఏప్రిల్ 2): జర్నలిస్టులు ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఎన్నికల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసేందుకు కృషి చేయాలని మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూ- ఐజేయూ), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏ.ఎస్.రావు నగర్ లోని డాక్టర్. హోమీ. జే.బాబా హాలులో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓటు హక్కు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ సదస్సుకు గౌరవ అతిథిగా తెలుగు రాష్ట్రాల ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ వి.వి.రావు, ఆత్మీయ అతిథిగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రవీందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడ్డమీద బాలరాజు, దొంతుల వెంకట్రామ్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, మేడ్చల్ జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.వి.రావు మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తితో డాక్టర్. బీ.ఆర్. అంబేద్కర్ జర్నలిస్టుల పాత్రపై ఆనాడే తెలిపారన్నారు. ప్రజా చైతన్యంకోసం పనిచేస్తున్న ప్రతీ ఒక్కరూ గొప్పవారేనన్నారు. అందులో జర్నలిస్టుల పాత్ర ఎంతో విలువైనదన్నారు. ప్రజాస్వామ్యానికి మూలం స్వేచ్ఛను ముందుకు తీసుకెళ్లేందుకు జర్నలిస్టుల కృషి మరువలేనిదన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలమైతే దాని విలువను కాపాడటంలో ప్రజలు వెనకబడిపోయారన్నారు. ఇన్ని సంవత్సరాలైనా ఎన్నికల కమిషన్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపే ప్రక్రియ లేకపోవడం దారుణమన్నారు. మునుగోడులో ఓటుకు 5000, 10000 వెలు ఇచ్చారని, ఎలాంటి సమాజంలో ఎన్నికలు జరుగుతున్నాయో ఊహించుకుంటే భయమేస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, అత్యధికంగా యువత ఉన్న దేశంలో ప్రజా చైతన్యం ఏమైపోయిందని ప్రశ్నించారు. ఈ ఎన్నికల సందర్బంగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఓటరు చైతన్యం క్షేత్రస్థాయిలో పనిచేయడంలేదన్నారు. మానవ మనుగడలో ప్రజలని చైతన్యం చేసేంతవరకు జర్నలిజం చనిపోదని నిరంతరం ప్రజల్ని చైతన్యం చేస్తూ నిబద్ధతతో వార్తా కథనాలు రాసినప్పుడే నిజమైన జర్నలిజం మనగలుగుతుందన్నారు. ఈవీఎం మూలాలు, పోలింగ్ బూతులలో సమస్యలపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈవీఎమ్ లపై ఓటరుకు, అభ్యర్థికి నమ్మకం కలగాలని తెలిపారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన అమలు చేసిన హామీలు, యూటర్న్ తీసుకున్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేది జర్నలిస్టులు మాత్రమే అన్నారు.
ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో అమెరికా కంటే ముందే భారతదేశం ప్రజలకు ఓటు హక్కును కల్పించిందన్నారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని అన్నివర్గాల ప్రజల నుండి అభిప్రాయం వస్తుందన్నారు. ఈనాడు ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బైనా ఉండాలి లేదా బెదిరించడం రావాలనే చందంగా మారిందన్నారు. ఇది మారాలని నిజంగా ప్రజలకు సేవ చేసే వారే ఎన్నికల్లో పోటీ చేసే రోజులు రావాలన్నారు. విలేకరులపై, జర్నలిస్టులపై దాడులేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పొందుపరచపోయినా మీడియాది నాలుగో(ఫోర్త్ ఎస్టేట్) అంగమని అన్నారు. మీడియాను రాజ్యాంగంలో బందించకూడదని అంబేద్కర్ అన్నారని తెలిపారు. సమాజాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్న, సమాజానికి సమాచారం అందించే వ్యక్తులే జర్నలిస్టులు అన్నారు. పత్రికకి కళ్ళు, చెవులు, విలేకరులన్నారు. ప్రజా ప్రయోజనాన్ని నెరవేర్చేది మీడియా అన్నారు. ఎన్నికల్లో ఖర్చుపై ఎన్నికల సంఘం విధించిన నిబంధనకు లోబడి ఎన్నికలు జరగడం లేదని అభ్యర్థులు ఎన్నికల్లో విజయం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. జర్నలిస్టులు రాజకీయ అవినీతి అక్రమాలపై ఏదో ఒక రూపంలో వ్యక్తం చేయలేకపోతే ప్రజాస్వామ్యానికి నష్టం చేకూరుతుందన్నారు. రాబోయే కాలంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే ధనవంతులు, డబ్బున్నవారే చేస్తారని ప్రజా సేవచేయాలనే మంచివారికి అవకాశం లేదని తెలిపారు. వాట్సాప్ 2019 ఎన్నికల్లో ఎక్కువ బాగం మిస్యూజ్ చేయడానికే పనికి వచ్చిందన్నారు. ఇప్పుడు కొత్తగా ఏఐ వ్యవస్థ వచ్చిందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వల్ల కొంత కాలం తర్వాత మీడియా కార్యాలయాల్లో డెస్కులు ఉండవని, యాంకర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉండరని తెలిపారు. మనం కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు నడవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఎన్నికల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీయాలని కోరారు. ప్రజలు, ఓటర్లు, విద్యావంతులు, ఉపాధ్యాయులు డబ్బులు తీసుకుని ఓటు వేయడం సిగ్గుచేటన్నారు.
ఈ సందర్భంగా కె.విరాహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమానికి ఆనాటి ఏపీయూడబ్ల్యూజే ఈనాటి టీయూడబ్ల్యూజే(ఐజేయూ) దశాబ్దాలుగా పోరాడుతుందని తెలిపారు. నేడు పుట్టగొడుగుల్లా జర్నలిస్టు సంఘాలు పుట్టుకొస్తున్నా జర్నలిస్టుల కోసం పోరాడే విశ్వసనీయ సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మాత్రమేనన్నారు. జర్నలిస్టులకు, ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్, అక్రిడిటేషన్ కార్డులు సాధించిన ఘనత టీయూడబ్ల్యూజే(ఐజేయూ) కు దక్కుతుందన్నారు. ఒకప్పుడు తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా అక్కడక్కడ నకిలీ జర్నలిస్టులు ఉండేవారని, ఇప్పుడు గంజాయిని తులసి మొక్కలలాగా జర్నలిస్టులు తయారయ్యారన్నారు. కలుపు మొక్కలనుఏరివేసి జర్నలిస్టు విలువలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు గడ్డమీద బాలరాజు, దొంతుల వెంకట్రాంరెడ్డిలు మాట్లాడుతూ జిల్లా జర్నలిస్టులు త్వరలోనే శుభవార్త వినబోతున్నారని తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, పట్టాలు, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని దీనిపై ఇప్పటికే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి విన్నవించామన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఎన్నికల తర్వాత శుభవార్త వింటారని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జర్నలిస్టుల డైరీని ఆవిష్కరించారు. నూతనంగా మీడియా అకాడమీ చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డిని మేడ్చల్ జిల్లా జర్నలిస్టులు సత్కరించుకున్నారు. అనంతరం మేడ్చల్ జిల్లా జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.