జర్నలిస్టులపై దాడికి పాల్పడితే సహించేది లేదు
కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్
కూకట్ పల్లి, మెట్రో సిటీ టైమ్స్ (ఏప్రిల్ 2): ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధులపై దాడిని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఖండించారు. సోమవారం ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజవర్గ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ బాధితులు తిప్పారపు సంపత్ తన గోడు వెల్లబోసుకునేందుకు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఈటెల రాజేందర్ అనుచరులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ లోకి చొరబడి సంపత్ పై దాడి చేయడంతో పాటు మీడియా సమావేశాన్ని కవర్ చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై దాడి చేయడం బాధాకరమని బండి రమేష్ అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే జర్నలిస్టులపై దాడి చేయటం దారుణమన్నారు. ఇలాంటి సంఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా బాధ్యులపై కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని బండి రమేష్ పోలీసులను కోరారు.